ఒకవైపు ‘భరత్ అనే నేను’ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తున్నాడు మహేశ్. యంగ్ సీఎం పాత్రలో నటించాడు. ఈ నెల 20న విడుదల కానుంది. నిజజీవితంలో కూడా మహేష్ రాజకీయాల్లోకి వస్తారే వార్తలు ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తున్నాయి.
ఇక మహేశ్ బాబు కుటుంబానికి కూడా రాజకీయ నేపథ్యం ఉంది. గతంలో సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా కూడా గెలిచారు. ఇక మహేశ్ బాబాయ్ ఆదిశేషగిరి రావు ఇప్పుడు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ మెంబర్‌గా ఉన్నారు. అలాగే మహేశ్ బాబు బావ గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇలా ఎలా చూసినా మహేశ్ బాబు కుటుంబానికి రాజకీయాలతో సంబంధ బాంధవ్యాలున్నాయి.
ఈ నేపథ్యంలో భరత్ అనే నేనులో పొలిటీషియన్‌గా కనిపిస్తున్నాడు కాబట్టి, పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడా? అనేది ఆసక్తిదాయకమైన ప్రశ్న. ఈ అంశం మీద మహేశ్ స్పందించాడు. ఒకే మాటతో రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని మహేశ్ తేల్చేశాడు.
ప్రస్తుతం భరత్ అనే నేను ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మహేశ్ బాబు రాజకీయాల్లోకి ఎంట్రీపై ఆసక్తి లేదని స్పష్టం చేశాడు. రాజకీయాలు తనకు ఏ మాత్రం సరిపడేవి కావని తేల్చి చెప్పాడు. ‘మరో రకంగా ప్రజాసేవ చేస్తాను కానీ, రాజకీయాల్లోకి రాను..’అని మహేశ్ బాబు స్ఫష్టం చేయడం విశేషం.
తమ సినిమా రాజకీయ సంబంధ కాన్సెప్ట్‌తోనే రూపొందినా, ప్రస్తుతం ఉన్న పార్టీల్లో దేన్నీ సపోర్ట్ చేయడం కానీ, విమర్శించడం కానీ సినిమాలో ఉండదని మహేశ్ స్పష్టం చేశాడు.