శ్రీ శ్రీదేవి ప్రోడక్షన్స్ బ్యానర్‌లో రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన డైరెక్షన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘పురుషోత్తముడు’. రాజ్ తరుణ్ సరసన హాసిని సుధీర్ హీరోయిన్‌గా నటించగా డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించారు. ఆకతాయి, హమ్ తుమ్ చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన…ఈ సినిమాను ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా తెరకెక్కించగా ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ తదితరులు కీలకపాత్ర పోషించారు. ఇక ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంతో రాజ్ తరుణ్ హిట్ కొట్టాడా లేదా చూద్దాం..
కథః
రామ్(రాజ్ తరుణ్) విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ఇండియాకి వస్తాడు. తన వారసుడిగా తన కంపెనీలకు రామ్‌ని సీఈవో చేయాలని భావిస్తాడు తండ్రి మురళీకృష్ణ. కానీ రామ్‌ను సీఈవో కాకుండా అడ్డుపడుతుంది రమ్యకృష్ణ. సీఈవో పోస్టుకు రామ్ అర్హుడు కాదని, ఒకవేళ కంపెనీకి సీఈవో కావాలంటే వంద రోజులు ఎవరికీ తెలియకుండా ఒక సాధారణ మనిషిలా బతకాలని కండీషన్ పెడుతుంది. ఈ కండీషన్‌కు ఒప్పుకుని ఓ మారుముల గ్రామానికి చేరుకుంటాడు రామ్. అక్కడ హీరోయిన్ అమ్ములుతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఆ ఊరి రైతులను మోసం చేస్తున్న వ్యక్తులతో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాడు, రామ్ చేసే పోరాటం ఏంటీ, తానేవరో వంద రోజులు ఎవరికీ తెలియకుండా ఉంచాడా?చివరికి కంపెనీ సీఈవో ఎవరు అయ్యారనేదే పురుషోత్తముడు మూవీ కథ.
విశ్లేషణ:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ రాజ్ తరుణ్ నటన, ఎమోషనల్ సీన్స్,. సినిమాను మొత్తం తన భుజాలపై నడిపించాడు రాజ్ తరుణ్. కామెడీ టైమింగ్‌తో పాటు యాక్షన్ సీన్స్‌లో ఇరగదీశాడు. సినిమాకు తన అందంతో మరింత గ్లామర్ తెచ్చింది హీరోయిన్ హాసిని సుధీర్. సీనియర్ నటులు రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, బ్రహ్మానందం మరింత ఆకట్టుకున్నారు. కథ తెలిసిందే అయినా దర్శకుడు ఎంచుకున్న కథనం, స్క్రీన్ ప్లే బాగుంది.
సాంకేతికంగా సినిమా బాగుంది. నిర్మాణ విలువలకు వంక పెట్టలేం. రామ్ భీమన డైరెక్షన్, గోపిసుందర్ సినిమాటోగ్రఫీ, మార్తాండ కె వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది.శ్రీమంతుడు, బిచ్చగాడు, పిల్ల జమిందార్ వంటి సినిమాలు ఈ కాన్సెప్ట్ తో వచ్చినవే అయినా పురుషోత్తముడు మెప్పించిందనే చెప్పుకోవాలి. మొత్తంగా ఈ వీకెండ్‌లో చూడదగ్గ చిత్రం పురుషోత్తముడు.
రేటింగ్ : 3/5