గీతా గోవిందం మూవీ హిట్ కావడంతో హీరో విజయ్ దేవరకొండ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. టీఆర్ఎస్ ఎంపీ కవిత విజయ్ తో పాటు చిత్ర దర్శకుడు పరశురామ్, నిర్మాతలను అభినందించారు. సినిమా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీశారంటూ కొనియాడారు. ఇలాంటి చిత్రాలు ఈ రోజుల్లో రావడం చాలా అరుదుగా జరుగుతున్నాయని, మహానటి తర్వాత వచ్చిన మంచి సినిమా ఇదేనని నాకనిపిస్తోంది. అంటూ కవిత ప్రశంసించారు.
అంతవరకూ బాగానే ఉంది. కానీ మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ వచ్చింది. విజయ్ ఇలాగే మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్లు. అంతేకాని పిచ్చి పిచ్చి సినిమాలు తీసి కెరీర్ పాడు చేసుకోకు. అసలే తెలంగాణ నుంచి ఇండస్ట్రీలో హీరోలు పెద్దగా ఎవరూ లేరు. నువ్వు ఒక్కడివే వరుస హిట్లు ఇస్తూ మన రాష్ట్రం తరఫున స్టార్ స్టేటస్ తెచ్చుకున్నావు. సో ఇకపైన కూడా సినిమాల ఎంపికలో ఇలాంటి జాగ్రత్తలే తీసుకో..అని కవిత విజయ్ దేవరకొండను హెచ్చరించారన్నది ఆ వార్తల సారాంశం.
విజయ్ దేవరకొండ కెరీర్ కు, కవిత సలహాతో కూడిన హెచ్చరిక వల్ల నష్టమే తప్ప లాభం కనిపించడం లేదు. పిచ్చి పిచ్చి సినిమాలు తీయకు, మంచి కథలు ఎంచుకో. అన్నంతవరకూ ఓకే. సంతోషం. కానీ తెలంగాణ నుంచి నువ్వే హీరోవి. ఇండస్ట్రీలో మన రాష్ట్రం తరఫున పెద్దగా హీరోలు లేరు. కనుక మంచి సినిమాలు ఎంచుకో…అని చెప్పడం. రాంగ్ స్టేట్ మెంటే. ఎందుకంటే ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, చిరంజీవి, వెంకటేశ్, రవితేజ, కృష్ణ, మోహన్ బాబు, శోభన్ బాబు, బాబూ మోహన్, జయసుధ, జయప్రద, ముమైత్ ఖాన్, అనుష్క, తమన్నా, ప్రభాస్, తాప్సీ, రిచా గంగోపాథ్యాయ, త్రిష, శృతిహాసన్, శ్రేయ, నయనతార, కమల్ హాసన్, రజనీకాంత్, ఇలా ఏ ఆర్టిస్టును చూసినా..వారిని కళాకారులుగానే ప్రేక్షకులు ఆదరించారు. ఆశీర్వదించారు. కానీ వారి కులం, ప్రాంతం, మతం, రాష్ట్రం, భాష చూసి ఆదరించలేదు. అభిమానులుగా మారలేదు. కళలకు, కళాకారులకు ఎల్లలు లేవు. అలాగే అభిమానానికీ హద్దులు లేవు. సినిమాలు బాగుంటే విదేశీ భాషవైనా చూస్తారు. నటీనటుల పెర్ ఫార్మెన్స్ నచ్చితే నీరాజనం పలుకుతారు. అంతేకానీ మా కులపోడనో, మా ప్రాంతమోడనో, మా మతం ఆర్టిస్ట్ అనో అభిమానం పెంచుకోరు. సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి, అనేకమందిని సూపర్ స్టార్లుగా చేసి, ఇండస్ట్రీని ఏలిన రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, దాసరి నారాయణరావు, కుమారులకు ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయారు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా వచ్చిన అనేకమందిని ఆదరించి నెత్తిన పెట్టుకుంటున్నారు ప్రేక్షకులు. విజయ్ దేవరకొండ కూడా అంతే. బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా పుష్కలంగా టాలెంట్ ఉన్న నటుడు. కథల ఎంపికలో జాగ్రత్తతో పాటు కొత్తదనం కనిపిస్తోంది. అందుకే అతడిని అన్నిప్రాంతాల వారూ ఆదరిస్తున్నారు. అభిమానిస్తున్నారు. అతడిని అలాగే ఉండనీయండి. అంతేకానీ మా కులపోడివి. మా రాష్ట్రం హీరోవి. అంటూ లేనిపోని ఆలోచనలు బుర్రకు ఎక్కించి, అతడితో పాటు అతడి అభిమానుల మనసులనూ పాడు చేయకండి. ఇది ఒక్క విజయ్ దేవరకొండ విషయంలోనే కాదు. ఏ కళాకారుడి విషయంలోనైనా…ఎవరైనా సరే కేవలం వాళ్లను కళాకారులుగానే చూడండి. అంతేకానీ కులం, మతం, ప్రాంతం, ఆపాదించి వారి కెరీర్ కు పరోక్షంగా గండి కొట్టకండి.