ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నటసార్వభౌమ బిరుదాంకితుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రపై దర్శకుడు తేజ ‘ఎన్టీఆర్’ సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు, ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఈ సినిమా మార్చి 29వ తేదీ హైదరాబాద్‌లోని రామకృష్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.
అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలకు స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు, ఆయన భార్య బసవతారకం సొంతూరు కొమరవోలు నుంచి కూడా అభిమానులు, ప్రజలను ఆహ్వానించారు. రామకృష్ణ స్టూడియోస్‌లో నిర్వహించే ఈ కార్యక్రమానికి మరో అదనపు ఆకర్షణ ఉండనుందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తన వియ్యంకుడు చంద్రబాబునాయుడును బాలకృష్ణ పిలిచినట్లు సమావేశం. ఆయనతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కూడా రమ్మని ఆహ్వానించారు అని తెలుస్తోంది. వీరిద్దరూ వస్తే మాత్రం సినిమాపై భారీ అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది.
‘ఎన్టీఆర్’ సినిమాను బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందురి నిర్మిస్తున్నారు. మార్చి 29వ తర్వాత షూటింగ్ ప్రారంభించి 2019 సంక్రాంతికి సినిమా విడుదల చేయాలని ప్లాన్.