మెగాస్టార్ చిరంజీవి, సూపర్ సక్సెస్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ డైరెక్టర్ అనగానే మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. అందుకు కారణం కొరటాల శివకు ఇంతవరకు ఫెయిల్యూర్ లేదు. పైగా ఆయన ప్రతి చిత్రంలోనూ కమర్షియల్ అంశాలతో పాటు ఓ సందేశం కూడా ఉంటుంది. గతంలో కొరటాల తెరకెక్కించిన శ్రీమంతుడు, భరత్ అను నేను, జనతా గ్యారేజ్, మిర్చి ఇలా ప్రతి చిత్రం ఏదో ఒక సందేశంతో ఉంటుంది.
ఇక ఆచార్యలోనూ చిరంజీవి నక్సలైట్‌గా కనిపించబోతున్నట్టు సమాచారం. అంతేకాక దేవాలయాలు వాటి మీద జరిగే దోపిడీ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన లిరికల్ సాంగ్ ‘లాహే లాహే’ సూపర్ హిట్ అయ్యింది. టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరోవైపు కరోనా ఎఫెక్ట్ తో ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలల పాటు ఆగిపోయింది. ‘ఆచార్య’ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్ టైనర్ బ్యానర్ సమర్పిస్తోంది. ఇవాళ ఈ మూవీ మేకర్స్ ‘ధర్మస్థలి తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి’ అంటూ ఓ ట్వీట్, రామ్ చరణ్ ఓ స్టిల్ విడుదల చేసింది. దీనిని బట్టి ఈ మూవీ షూటింగ్ ఆఖరి షెడ్యూల్ వేగంగా సాగుతున్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సెప్టెంబర్ లో ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం.