పుష్పలో మాస్ సాంగ్ తో ప్రేక్షకులతో ఊ కొట్టించిన హీరోయిన్ సమంత సుకుమార దేవతలా మారిపోయింది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న సరికొత్త చిత్రం శాకుంతలం. మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి సమంత ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘ప్రకృతిని ప్రేమించే సుకుమార దేవత, గంభీర శాకుంతల’ అని చిత్ర బృందం ట్వీట్ చేసింది. తెల్లని దుస్తుల్లో చుట్టూ వన్య ప్రాణుల మధ్య శకుంతల పాత్రలో దేవకన్యలా మెరిసిపోయింది సమంత. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూరుస్తుండగా నీలిమ గుణ నిర్మిస్తున్నారు.

సమంతతో పాటు దేవ్ మోహన్ ముఖ్యభూమిక పోషిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. అల్లు అర్జున్ తనయ అర్హ ఇందులో కనిపించనుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.