ఈ మధ్య హర్రర్ కామెడీ జానర్ సినిమాలు రావడం బాగా పెరిగిపోయింది. ఆ నైపథ్యంలో వచ్చిన సినిమానే ఈ ‘తను వచ్చెనంట’. కాస్త కొత్తదనం జోడించి కామెడీ హర్రర్ మీక్స్ చేసి ఈ సినిమాని రూపొందింది. ‘గుంటూరు టాకీస్’ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న రష్మీ గౌతమ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడంది. ఇక ఈ రోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…
కథ :
కుటుంబపరమైన కారణాల వల్ల ప్రేమించిన అమ్మాయి శ్వేత(ధన్య బాలకృష్ణన్) కు దూరమైన తేజ (తేజ) అనే యువకుడు విధి లేక వేరొక అమ్మాయి శృతి (రష్మి) ని పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆమె పెట్టె ఇబ్బందులు తట్టుకోలేక, ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక తేజ శృతి తనకు దూరం చెయ్యాలనే ప్రయత్నంలో ఊహించని తప్పు చేస్తాడు.
అతను చేసిన ఆ తప్పేమిటి ? ఆ తప్పు వల్ల అతని భార్య శృతికి ఏమైంది ? మళ్ళీ ఆమె తేజ జీవితంలోకి ఎలా వచ్చింది ? వచ్చి అతన్ని ఎలా ఇబ్బంది పెట్టింది ? తేజ ఆ ఇబ్బందుల్ని తట్టుకుని తను ప్రేమించిన అమ్మాయి శ్వేతను దక్కించుకున్నాడా లేదా ? అన్నదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో ప్లస్ పాయింత్స్ విషయంలోకి వెళ్తే.. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చలాకి చంటి గురించి. హీరో ప్రెండ్ పాత్రలో నటించిన చంటి తన కామెడి తో సినిమాని బాగా నడిపించాడు. సినిమా మొదలు నుంచి చివరి వరకు తన కామెడితో అదరగొట్టాడు. అలాగే ఇంటర్వెల్ బాంగ్ కూడా బాగుంది. ఉన్నట్టుండి ఊహించని పరిస్థితిలో తేజ భార్య శృతి పాత్రలో రష్మీ గౌతమ్ ఎంట్రీ కాస్త థ్రిల్ కలిగిస్తుంది. హీరోయిన్లు రష్మీ, ధన్య బాలకృష్ణన్ లు స్క్రీన్ మీద కలర్ ఫుల్ గా కనిపించడమే గాక నటన పరంగా మెప్పించారు. జాంబీ పాత్రలో రష్మిసెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. కొత్త హీరో తేజ్ నటన ఆమోదయోగ్యంగానే ఉంది. నిర్మాత చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల అందించిన జాంబీ స్టోరీ లైన్ కాస్త కొత్తగా అనిపించింది.
మైనస్ పాయింట్స్ :
ముఖ్యంగా జాంబీ అనే స్టోరీ లైన్ బానే ఉన్నా డైరెక్టర్ దాని ప్రేక్షకులకు కనెక్టయ్యే విధంగా చూపలేకపోయాడు. ఒకానొక సందర్భంలో జాంబీ అంటే ఇదేనా అనే నిరుత్సాహం కలిగింది. ఇక జాంబీకి మైండ్ తప్ప మనసు ఉండదు అని చెప్పి చివరిలో ఎమోషనల్ సన్నీవేశం పెట్టి కథను ముగించడం ఏమాత్రం లాజిక్ లేని విషయం. జాంబీ కథలోకి ఎంటరైన దగ్గర్నుంచి అబ్బో సెకండాఫ్ లో అదిరిపోయే హర్రర్ సీన్లు వచ్చేస్తాయి, జాంబీ హీరోని ఒక ఆట ఆడేసుకుంటుంది అనుకుంటే తృప్తినిచ్చే అలాంటి సన్నివేశం ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు. జాంబీగా రష్మీ చేత ఇంకా మంచి పెర్ఫార్మెన్స్ రాబట్టి ఉండవచ్చు కానీ ఎందుకో దర్శకుడు ఆ ప్రయత్నం చేయలేదు. రష్మీ నటించిన సినిమా నుండి ప్రేక్షకుడు ఆశించే హాట్, హాట్ రొమాంటిక్ సన్నివేశాలు ఇందులో అసలు లేవు. కొన్ని సన్నివేశాలైతే పాత హర్రర్ కామెడీ సినిమాల్లోని సీన్లని కాపీ కొట్టినట్టే ఉండి బోర్ కొట్టించాయి.
మొత్తంగా:
రొటీన్ హర్రర్ కథలకు కాస్త డిఫరెంట్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయంలేని జాంబీతో హర్రర్, దానికి అదనంగా కామెడీ కలిపి జామెడీ జానర్లో తీసిన ఈ చిత్రం జాంబీ పరంగా న్యాయం చేయలేకపోయినా కామెడీ పరంగా మాత్రం న్యాయం చేసింది. టైమింగ్ తో సాగే చలాకి చంటి కామెడీ, కాస్త థ్రిల్లింగ్ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఇందులో ప్లస్ పాయింట్స్ సెకండాఫ్ లో రొటీన్ బోరింగ్ సన్నివేశాలు, రష్మీ నుండి సాధారణంగా ఆశించే పెర్ఫార్మెన్స్ లేకపోవడం ఇందులో మైనస్ పాయింట్స్. మొత్తం మీద చెప్పాలంటే కామెడీని ఇష్టపడుతూ, రొటీన్ బోరింగ్ హర్రర్ సన్నివేశాల్ని తట్టుకోగలిగితే ఈ సినిమాని ఒక్కసారి చూడొచ్చు. అంతేగాని ఏదో జాంబీ జానర్ అని, రష్మీ మెయిన్ క్యారెక్టర్ చేసిందని సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా నిరుత్సాహం కలుగుతుంది.
మూవీ రేటింగ్ : 2.25
