ప్రముఖ సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. రెండు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రెండు రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం కన్నుమూశారు.
గతంలో పెరాలసిస్‌తో కొంత కాలం బాధ పడిన కోడి రామకృష్ణ.. ఆ తర్వాత కోలుకున్నారు. కానీ ఈ సారి మాత్రం వైద్యులు ఆయనను కాపాడలేకపోయారు.
విలక్షణ దర్శకుడైన కోడి రామకృష్ణ.. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. తెలుగుతో పాటు పలు తమిళ, మలయాళ, హిందీ సినిమాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు. టాలీవుడ్‌లో ఉన్న అగ్ర హీరోలందరితోనూ ఆయన సినిమాలు చేశారు. 2016లో కన్నడ చిత్రం ‘నాగహారవు’ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన చివరి సినిమా.
‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కోడిరామకృష్ణ… మధ్యతరగతి జీవితాలను, అందులోని ఒడిదొడుకులను కథా వస్తువుగా ఎంచుకుని కోడి రామకృష్ణ సినిమాలను రూపొందించారు. అమ్మోరు, దేవుళ్లు, దేవి, అరుంధతి, మువ్వ గోపాలుడు, పెళ్లి, శత్రువు లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను కోడి రామకృష్ణ తెరకెక్కించారు.
కోడి రామకృష్ణ దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ రాణించారు. కెరీర్ ఆరంభంలో పలు పాత్రలు పోషించారు. సినిమా ఇండస్ట్రీలో దాదాపు ముప్పై ఏళ్లుగా ఆయన కెరీర్‌ని కొనసాగించారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు అంటూ చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటించారు