విజయ్ ఆంటోనీ సెన్సిబుల్ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటూ.. నటుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన పంధాను ఏర్పరుచుకొన్న నటించిన తాజా చిత్రం ‘కాశి’. సినిమా విడుదలకు ముందే 7 నిమిషాల సినిమాను విడుదల చేసి కథపై ఆసక్తిని క్రియేట్ చేశాడు. ఈ శుక్రవారం సినిమా పేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
కథ: భరత్ (విజయ్ ఆంటోని) న్యూయార్క్‌లో డాక్టర్. సొంత హాస్పిటల్, హోదా, మంచి కుటుంబం అన్నీ ఉన్నా భరత్‌ను ఏదో పొగొట్టుకున్నా అన్న భావన వెంటాడుతుంటుంది. ఓ చిన్న బాబును ఎద్దు పొడిచినట్టుగా ఓ కల చిన్నతనం నుంచి వస్తుంటుంది. తన తల్లి కిడ్నీలు ఫెయిల్ అవ్వటంతో భరత్ జీవితం మలుపు తిరుగుతుంది. ఇన్నాళ్లు తను అమ్మానాన్నలు అనుకుంటున్న వారు తనను పెంచిన తల్లిదండ్రులు మాత్రమే అని తెలుస్తుంది. దీంతో తనకు రోజు వచ్చే కలకు తన గతానికి ఏదో సంబంధం ఉందన్న నమ్మకంతో తనను కన్న తల్లిదండ్రులను వెతుక్కుంటూ ఇండియాకు వస్తాడు భరత్. అనాథశ్రమంలో తన తల్లిపేరు పార‍్వతి అని, ఆమె సొంత ఊరు కంచెర్లపాలెం అని తెలుసుకొని ఆ ఊరికి వెళతాడు. అక్కడ తన వారిని ఎలా కలుసుకున్నాడో అనేది మిగిలిన కథ.
విశ్లేషణ: ‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగునాట క్రేజ్ తెచ్చుకున్న నటుడు విజయ్ ఆంటోనీ సినిమా విడుదలవుతుందంటే ఇక్కడి ప్రేక్షకులు కూడా కొత్తదనం ఉంటుందని భావిస్తున్నారు. అతడు నటించిన భేతాళుడు, ఇంద్రసేన వంటి చిత్రాలకు హిట్ టాక్ రానప్పటికీ ప్రయోగాత్మక చిత్రాలుగా మిగిలిపోయాయి. కానీ ఈసారి విజయ్ ఆంటోనీ ఏం నచ్చి ఈ సినిమా ఎన్నుకున్నాడనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. చిన్నప్పుడే తన తల్లితండ్రులకు దూరమైన పిల్లాడు పెద్దయిన తరువాత వారిని వెతుక్కుంటూ వెళ్ళడం అనే కాన్సెప్ట్ బాగానే ఉంది. హీరో ఇండియాకు రావడం తన తల్లి చనిపోయిందని తెలుసుకునే వరకు సినిమా బాగానే ఉంది. ఎప్పుడైతే తన తండ్రి కోసం కంచెర్లపాలెం అనే గ్రామానికి వెళ్తాడో.. అక్కడ ప్రజలకు ఉచిత వైద్య సహాయం చేయడం, అందరి డిఎన్ఏ లను చెక్ చేస్తూ తనతో మ్యాచ్ అయిందో లేదో చూసుకుంటూ సినిమా మొత్తం ఇదే సాగుతుంది. ఇక క్లైమాక్స్ సన్నివేశాలు చూసి ఇంతేనా కథ అనిపించక మానదు. పైగా సినిమా మొత్తం తమిళ నేటివిటీతో నిండిపోయింది. తెలుగు వారికి ఈ సినిమా కనెక్ట్ అవ్వడం కష్టమే.. హీరోయిన్ అంజలిపాత్ర గురించి చెప్పుకోవడానికి ఏం లేదు.
బోటమ్ లైన్: మరో ఫ్లాప్ సినిమాతో వచ్చిన విజయ్ అంటోనీ
