ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండే కత్రినా కైఫ్ కొన్నాళ్ళుగా మరీ నల్లపూస అయిపోయింది. అనురాగ్ బసు దర్శకత్వంలో రణబీర్ కపూర్‌తో కలిసి నటిస్తున్న సినిమా ఒక్కటే ఆమె చేతిలో ఉంది. ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదల కానుంది.
కాగా తన సినిమాలకు సంబంధించిన విషయాలనే కాక పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసే క్యాట్ తాజాగా ఓ ఫోటో ఒకటి షేర్ చేసింది. అందులో ఆమె ఒక పాత కారు ముందు కూర్చొని ఉంటుంది. ఫోటో, ఫోజూ రెండూ బాగానే ఉన్నాయి కానీ కత్రినా ఎడమచేతిని చూసిన అభిమానులకే ఒక్కసారి షాక్ తగిలింది. ఎందుకంటే ఎడమ మోచేతి వరకూ కట్టు కట్టి ఉంది. దానికి తగ్గట్టే “సూర్యాస్తమయం అయ్యేటప్పుడు ఎంత ముఖ్యమైన పని ఉన్నా, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అలా చూస్తూ ఉండిపోవాలి” అంటూ ఆ ఫొటోకి క్యాప్షన్ కూడా ఒకటి తగిలించేసింది. అయితే ఆ తర్వాత ఈ చెయ్యి కట్టు వేషమంతా తాజా సినిమా జగ్గా జుసూస్ ప్రమోషన్ కోసమని తెలుసుకుని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఏది ఏమైనా ఆ ఫొటో చూస్తుంటే నిజంగానే క్యాట్ చేతికి ఏమైందో అన్న కంగారు రావడం మాత్రం ఖాయమే కదండీ.