బాలీవుడ్ అగ్రకథానాయకుడు ఆమిర్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుండి తీవ్రమైన బెదిరింపులు ఎదురయ్యాయి. ఈ మేరకు బిష్ణోయ్ సోదరుడు అర్జూ, మరో వ్యక్తి టైసన్‌లకు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపుతోంది. ఈ ఆడియోలో ఆమిర్ ఖాన్ వ్యక్తిగత జీవితంపై ఆ గ్యాంగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇటీవల ఆమిర్ ఖాన్ తన ప్రేయసి గౌరీ స్ర్పాట్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆమిర్ ఖాన్ మూడో వివాహం చేసుకొని మతపరమైన వివాదానికి తావిచ్చారని, ఇది భారతీయ సంస్కృతికి, సనాతన ధర్మానికి వ్యతిరేకమని ఆ ఆడియోలో పేర్కొన్నారు. ఈ వివాహం ద్వారా ఆమిర్ ఖాన్ సమాజంలో తప్పుడు సంకేతాలు పంపుతున్నారని ఆరోపిస్తూ, దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు. ఈ బెదిరింపు ఆడియో ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని గ్యాంగ్‌స్టర్లు బెదిరింపులకు పాల్పడటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
లారెన్స్ బిష్ణోయ్ ముఠా బాలీవుడ్ సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలువురు స్టార్ నటులు ఈ గ్యాంగ్ నుండి బెదిరింపులను ఎదుర్కొన్నారు. 1998 కృష్ణజింకల వేట కేసు నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని ఈ గ్యాంగ్ పదేపదే హెచ్చరించింది. ఆయన ఇంటి వద్ద కాల్పులు జరపడం, లేఖల ద్వారా బెదిరించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ‘పఠాన్’ సినిమా విడుదల సమయంలో, ఆ తర్వాత కూడా భద్రతాపరమైన కారణాలతో షారూఖ్ ఖాన్ ఈ ముఠా నుండి హెచ్చరికలను ఎదుర్కొన్నారు.
సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఈ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత కూడా పలువురు పంజాబీ గాయకులను ఈ ముఠా టార్గెట్ చేస్తూ వస్తోంది. సల్మాన్ ఖాన్‌కు మద్దతుగా నిలిచిన లేదా ఆయనతో సన్నిహితంగా ఉన్న కొందరు నిర్మాతలు, నటులకు కూడా ఈ ముఠా గతంలో పరోక్షంగా బెదిరింపులకు పాల్పడింది.
