హరియాణాలోని ఫరీదాబాద్ సిక్రోనా గ్రామంలో అత్యంత అమానుషమైన, భయానక ఘటన వెలుగు చూసింది. పాఠశాలలో విధి నిర్వహణలో ఉన్న ఓ యువ ఉపాధ్యాయురాలిని కామాంధుడు అతి కిరాతకంగా కత్తితో పొడిచి హతమార్చిన వైనం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. దినచర్యలో భాగంగా సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన ఆ ఉపాధ్యాయురాలి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫరీదాబాద్‌లోని సరస్వతి సీనియర్ సెకండరీ స్కూల్‌లో 29 ఏళ్ల సంధ్య ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం ఆమె సాధారణంగానే పాఠశాలకు రాగా, ఆమెను కలవాలంటూ గేటు వద్దకు ఓ యువకుడు వచ్చాడు. సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సంధ్య బయటకు వెళ్లగా, అప్పటికే ముసుగు ధరించి కాచుకుని ఉన్న నిందితుడు ఆమెపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. నిందితుడు పాఠశాల లోపలే కొంతసేపు వేచి చూశాడు. సంధ్య రాగానే ఆమెను పట్టుకుని లాగి కత్తితో వరుసగా పొడిచాడు. ముఖం, మెడ, ఛాతి, పొట్ట భాగాల్లో తీవ్ర గాయాలు అయ్యేలా కేవలం అర నిమిషంలో దాదాపు 20 నుంచి 30 సార్లు కత్తితో అతి కిరాతకంగా దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఆ అరుపులు విని పాఠశాల నిర్వాహకుడు తేజ్‌పాల్ అక్కడికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేయగా, నిందితుడు అతడిపై కూడా కత్తితో దాడికి యత్నించడంతో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అనంతరం సంధ్యపై మరోసారి విచక్షణారహితంగా దాడి చేసి, నిందితుడు బైక్‌పై పరారయ్యాడు. ఈ దారుణ ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు, నిందితుడి కోసం గాలించి కేవలం రెండు గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అమిత్ (21)గా గుర్తించగా, విచారణలో అతడు నేరాన్ని అంగీకరించాడు.
ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అమిత్‌కు సంధ్యతో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడిందని, అయితే ఆమె మాట్లాడేందుకు ఎంతమాత్రం ఆసక్తి చూపకపోయినా నిందితుడు నిత్యం వెంటపడుతూ వేధించేవాడని తేలింది. ఈ వేధింపులు మితిమీరిపోవడంతో ఇటీవలే ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, కేసు కూడా నమోదైంది. అయితే ఆ సమయంలో అమిత్ బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో ఆమె కేసును వాపసు తీసుకుంది. ఆ కక్షను మనసులో పెట్టుకునే ప్రతీకారంతో ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
