సినీ రంగంలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఒక యువనటిని లైంగికంగా వేధించిన క్యాస్టింగ్ ఆర్టిస్ట్ దారుణానికి సంబంధించిన షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇండస్ట్రీలో హీరోయిన్‌కు స్నేహితురాలిగా నటించే ఛాన్స్ ఇప్పిస్తానని నమ్మించి, పారితోషికం ఇవ్వకుండా వేధింపులకు పాల్పడిన ప్రసాద్ అనే వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 21 ఏళ్ల యువనటి కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రసాద్ అనే క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఓ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ఇప్పిస్తానని చెప్పి ఆమెకు అవకాశం కల్పించాడు. 2025 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు షూటింగ్ పూర్తి చేసిన సదరు నటికి, రావాల్సిన రూ. 90 వేల పారితోషికం మరియు రూ. 38 వేల ప్రయాణ ఖర్చులు కలిపి మొత్తం లక్షా పాతిక వేల రూపాయలను ప్రసాద్ చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.
ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 18న పారితోషికం ఇస్తానని నమ్మించి, నటిని కలవాలని ప్రసాద్ కోరాడు. నటి అక్కడికి వెళ్లగానే, ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకున్నాడు. ఆ సమయంలో “నా కోరిక తీరిస్తేనే నీకు మరిన్ని మంచి సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తాను” అని లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఎలాగోలా నిందితుడి నుండి తప్పించుకున్న ఆ యువనటి, వెంటనే ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తన తల్లికి వివరించింది. కూతురు చెప్పిన మాటలు విన్న తల్లి తీవ్ర ఆగ్రహంతో నిందితుడు ప్రసాద్‌ను ఫోన్ ద్వారా నిలదీసింది.
అయితే ప్రసాద్ ఏమాత్రం భయపడకుండా బాధితురాలి తల్లిని కూడా అసభ్యకర పదజాలంతో దూషించాడు. జరిగిన అవమానానికి, తనకు దక్కాల్సిన పారితోషికం కోసం, తనపై జరిగిన దాడికి వ్యతిరేకంగా సదరు యువనటి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. నటి ఫిర్యాదు మేరకు నిందితుడు ప్రసాద్‌పై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
