త‌ల్లి మంద‌లించింద‌ని.. వివాహిత ఆత్మహత్య

హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విషాదకర ఘటన జరిగింది. సెల్‌ఫోన్ ఎక్కువగా చూస్తున్నావని తల్లి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన లక్ష్మిదేవి (25)కి, నల్గొండ జిల్లాకు చెందిన లక్ష్మణ్‌తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి హయత్‌నగర్ బొమ్మలగుడి సమీపంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. భర్త పెయింటర్‌గా, ఇళ్లలో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

ఇటీవల లక్ష్మిదేవికి ఈఎంఐ పద్ధతిలో సెల్‌ఫోన్ కొనిచ్చారు. అప్పటి నుంచి ఆమె ఎప్పుడూ ఫోన్ చూస్తూనే ఉంది. ఏ పని చేయకుండా రోజూ ఫోన్ చూడటంపై తల్లి అలివేలు గురువారం ఆమెను మందలించింది. ఏదైనా పని చేసుకోవాలని హితవు పలికింది.

శుక్రవారం ఉదయం భర్త పనికి వెళ్లిపోయాడు. పెద్ద కూతురును బడికి పంపలేదు. చిన్న కుమారుడిని అక్కతో కలిసి టీవీ చూడమని చెప్పింది. ఆ తర్వాత లక్ష్మిదేవి గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కన్నతల్లి చిన్నమాట మందలించిందనే మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది.