జైలులో యువకుడికి చీర కట్టించి.. లైంగికంగా వేధించిన ఖైదీలు

జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని హోత్వార్ జైలులో ఒక దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఒక కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న 20 ఏళ్ల యువకుడిని తోటి ఖైదీలు తీవ్రంగా వేధించారు. పండుగల సమయాలలో అతడికి బలవంతంగా చీర కట్టించారు. ఆ యువకుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

మహాశివరాత్రి, శ్రీరామనవమి, సర్హుల్ పండుగల సమయంలో నిందితులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితుడికి మత్తుమందు ఇచ్చి మూడుసార్లు అత్యాచారం చేశారు. ఈ దారుణం వల్ల యువకుడు తీవ్రంగా గాయపడి రక్తం కారినప్పటికీ జైలు అధికారులు పట్టించుకోలేదు. వైద్య చికిత్స అందించకపోగా, అతడి ఫిర్యాదు లేఖను సైతం చించివేశారు.

ఈ ఏడాది జూన్ 12న కోర్టు ఆ యువకుడిని నిర్దోషిగా విడుదల చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బాధితుడు తన కుటుంబ సభ్యులతో జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. జైలు సూపరింటెండెంట్, వైద్య అధికారి, వార్డు ఇన్‌చార్జ్‌తో పాటు పలువురు ఖైదీలు సహా మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణలపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు ముమ్మరం చేశారు. జైళ్లలో భద్రత, అధికారుల నిర్లక్ష్యంపై ఈ ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది.