ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. ముగ్గురి మృతి

వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి ఘాట్‌ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని కేసారం గ్రామానికి చెందిన 54 మంది ఓ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారంతా ప్రైవేటు బస్సులో వికారాబాద్‌ జిల్లా ధరూర్‌ మండలం చింతకుంటకు తిరుగు ప్రయాణమయ్యారు. అనంతగిరి కొండ పైనుంచి కిందకు దిగుతుండగా ఘాట్‌ రోడ్డులోని ఓ మలుపు వద్ద బస్సు అదుపుతప్పింది. రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో తీవ్ర ఆర్తనాదాలు మిన్నంటాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.