- Advertisement -

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ!

- Advertisement -

రక్షక భటులే భక్షకులుగా మారి లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులు వారి ఆట కట్టించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ మరియు ఒక కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. ఒక ప్రేమ జంట వివాహం చేసుకున్న వ్యవహారంలో వారిని బెదిరించి, కేసు లేకుండా సెటిల్ చేసేందుకు ఎస్ఐ పి.నాగరాజు, కానిస్టేబుల్ బాలకృష్ణలు రూ. 70,000 లంచం డిమాండ్ చేశారు. బాధితులు అంత ఇచ్చుకోలేమని వేడుకున్నా వారు వినకపోవడంతో, బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

బాధితుల ఫిర్యాదు మేరకు పక్కా ప్లాన్ వేసిన ఏసీబీ అధికారులు, గురువారం తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్‌లో మాటు వేశారు. బాధితుల నుండి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ లంచం డబ్బులు తీసుకుంటుండగా ఒక్కసారిగా దాడి చేసి వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

ఎస్ఐ నాగరాజు, కానిస్టేబుల్ బాలకృష్ణలను అదుపులోకి తీసుకున్న ఏసీబీ బృందం, పోలీస్ స్టేషన్‌లో కీలక రికార్డులను పరిశీలిస్తోంది. వారి చేతులపై కెమికల్ టెస్ట్ నిర్వహించి, లంచం తీసుకున్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లో సోదాలు కొనసాగుతున్నాయి.

అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడటంతో స్థానిక పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేగింది. రక్షించాల్సిన వారే ఇలా అక్రమ వసూళ్లకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -