హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్లో ఒక దారుణ హత్య కలకలం రేపింది. మద్యం మత్తులో మొదలైన చిన్నపాటి గొడవ ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొంది. డబ్బుల విషయంలో తలెత్తిన వివాదానికి తోడు, తనను, తన తల్లిని అసభ్యంగా దూషించాడన్న కోపంతో 17 ఏళ్ల బాలుడు తనతో పాటు పనిచేస్తున్న వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సీఐ పి.కిరణ్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన 17 ఏళ్ల బాలుడు జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు. ఘట్కేసర్ మండలం అవుషాపూర్‌లోని జగత్ స్వప్న స్పార్కిల్ క్యాసిల్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతడి బంధువైన శివ కూడా అదే చోట వాచ్‌మెన్‌గా పనిచేస్తూ, ఇద్దరూ ఒకే గదిలో నివసిస్తున్నారు.
కొంతకాలంగా వీరిద్దరి మధ్య డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శివ తరచూ బాలుడిని, అతడి తల్లిని దూషించేవాడు. దీంతో శివపై బాలుడు తీవ్ర కక్ష పెంచుకున్నాడు. ఆదివారం రాత్రి ఇద్దరూ కలిసి గదిలో మద్యం సేవించారు. ఆ సమయంలో మరోసారి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
తీవ్ర ఆగ్రహానికి గురైన బాలుడు, మత్తులో ఉన్న శివను కిందపడేశాడు. అక్కడే ఉన్న సిమెంట్ ఇటుకతో అతడి ముఖం, తలపై బలంగా మోదాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శివ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం ఆవేశం చల్లారని బాలుడు, గదిలో ఉన్న కూరగాయలు కోసే కత్తితో మృతుడి మర్మాంగాన్ని కోసి అక్కడి నుంచి పరారయ్యాడు.
సమాచారం అందుకున్న ఘట్కేసర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. సోమవారం అవుషాపూర్ పరిసరాల్లో సంచరిస్తున్న బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

