కానిస్టేబుల్ స్థాయి నుంచి కష్టపడి ఐపీఎస్ సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలవాల్సిన ఓ యువ అధికారి, సోషల్ మీడియా పాపులారిటీకి ఆశపడి తన కెరీర్‌ను తానే నాశనం చేసుకున్నారు. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను లైంగికంగా వేధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డికి కోర్టులో తాజాగా చుక్కెదురైంది. ఈ కేసు విచారణలో భాగంగా ఆయనను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉప్పరపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు అనుమతితో రాజేంద్రనగర్ సబ్ డివిజన్ పోలీసులు ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ కృష్ణారెడ్డి గతంలో కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. పై అధికారి అవమానించారనే కసితో ఆ ఉద్యోగాన్ని వదిలేసి, తీవ్రంగా శ్రమించి సివిల్స్ సాధించి ఐపీఎస్‌గా సెలెక్ట్ అయ్యారు. ఈ స్ఫూర్తిదాయక ప్రయాణం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ఆయన ఒక్కసారిగా ఓవర్‌నైట్ సెలబ్రిటీగా మారిపోయారు. వివిధ ఇంటర్వ్యూల ద్వారా యువతకు పరిచయమై అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఆయన శిక్షణ పొందుతున్నారు.
అయితే కొన్నాళ్ల క్రితం తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారులను ఉదయ కృష్ణారెడ్డి వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకునేందుకు ఆయన ఆత్మహత్యాయత్నం చేసినట్లు నాటకం ఆడినప్పటికీ, చికిత్స అందించిన వైద్యులు అలాంటిదేమీ లేదని తేల్చిచెప్పారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.
ఈ విచారణలో భాగంగా ఉదయ కృష్ణారెడ్డికి మరో మహిళతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఏపీకి చెందిన ఆ మహిళకు 2014లోనే వివాహం కాగా, 2023 నుంచి ఆమె భర్తకు దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్‌కు వచ్చి కొంతకాలం ప్రైవేట్ ఉద్యోగం చేసిన ఆమె, ఉదయ కృష్ణారెడ్డి సూచన మేరకు ఆ ఉద్యోగం మానేసి అశోక్‌నగర్‌లోని ఓ ఐఏఎస్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్నారు. అయితే ఆమెతో లివిన్ రిలేషన్‌లో ఉండాలని ఉదయ కోరగా, చట్టప్రకారంగా విడాకులు రాకపోవడంతో ఆమె దాన్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
