భిక్షాటన చేసుకునే ఓ అభాగ్యురాలిని ఆశ్రయం పేరుతో ఇంటికి తెచ్చి, ఆపై ఆమెను లోబరుచుకున్న కామాంధుడు.. పెళ్లికి పట్టుబడిందనే కోపంతో కడతేర్చిన అత్యంత దారుణమైన ఘటన విశాఖపట్నంలో వెలుగు చూసింది. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి, రైలులో వేరే రాష్ట్రానికి తరలించి పడేసిన ఈ ఉదంతం సంచలనం సృష్టించింది.
విశాఖపట్నం కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని దుర్గానగర్‌కు చెందిన బొలిశెట్టి సురేష్ (32) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఇప్పటికే వివాహం కాగా, భార్య గర్భిణి. కొన్ని నెలల క్రితం రైల్వేస్టేషన్లు, బస్టాప్‌ల వద్ద భిక్షాటన చేసుకునే ఓ బాలికతో సురేష్‌కు పరిచయం ఏర్పడింది. తనకు ఎవరూ లేరని ఆ బాలిక చెప్పడంతో, గర్భిణిగా ఉన్న భార్యకు సాయంగా ఉంటుందంటూ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఆమెతో సురేష్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. మార్చి 24న సురేష్ భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆ బాలిక సురేష్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తూ.. తనను వెంటనే పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఈ విషయం అందరికీ చెబుతానని హెచ్చరించింది.
దీంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరగడంతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15న ఉదయం ఆ బాలిక నేరుగా సురేష్ ఇంటికి వచ్చి గొడవకు దిగింది. పెళ్లి విషయమై మాటామాటా పెరగడంతో విచక్షణ కోల్పోయిన సురేష్ ఆమెను గట్టిగా కొట్టాడు. ఈ దాడిలో ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. భయపడిపోయిన నిందితుడు ఆ శవాన్ని మాయం చేసేందుకు కిరాతక ప్లాన్ వేశాడు. మృతదేహాన్ని ఒక పెద్ద ట్రాలీ బ్యాగ్‌లో కుక్కి, జ్ఞానాపురం రైల్వేస్టేషన్‌కు వెళ్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు ఒడిశా రాష్ట్రంలోని రాయగడకు చేరుకున్నాడు.
అక్కడ చాందిలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతంలో ఆ ట్రాలీ బ్యాగ్‌ను పడేసి, తిరిగి అదే రాత్రి రైలెక్కి విశాఖకు చేరుకున్నాడు. అయితే మూడు రోజుల తర్వాత చాందిలి ప్రాంతంలో తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాలీబ్యాగ్‌లో కుళ్ళిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించి దర్యాప్తు ప్రారంభించారు.
ఆ ప్రాంతంలోని మొబైల్ ఫోన్ సిగ్నల్స్, కాల్ డేటా రికార్డుల (CDR) ఆధారంగా సాంకేతిక నిపుణుల సహాయంతో ఒడిశా పోలీసులు విశాఖకు చేరారు. స్థానిక కంచరపాలెం పోలీసుల సహకారంతో నిందితుడు సురేష్‌ను అదుపులోకి తీసుకుని, విచారణ నిమిత్తం చాందిలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మానవత్వాన్ని మంటగలిపి, ప్లాన్ ప్రకారం చేసిన ఈ హత్యోదంతం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
