వైభ‌వ్ ట్రిపుల్ సెంచ‌రీ కూడా కొడ‌తాడు: కోచ్ మనీశ్‌ ఓజా

క్రికెట్ ప్రపంచంలో వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతడు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా 28 సిక్సర్లు, 7 ఫోర్లు బాదాడు. ఈ నేపథ్యంలో వైభవ్ చిన్ననాటి కోచ్ మనీశ్‌ ఓజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భవిష్యత్తులో వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ (300 పరుగులు) కూడా సాధిస్తాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైభవ్ డబుల్ సెంచరీ చేస్తాడని తాను రెండేళ్ల క్రితమే ఊహించినట్టు ఓజా తెలిపారు. ప్రస్తుతం అతడి ఆటతీరు చూస్తుంటే ఇంకా ఎన్నో రికార్డులు బద్దలవుతాయని చెప్పారు. ప్రస్తుతానికి అతడి రికార్డులను బద్దలుకొట్టే ఆటగాడు కనిపించడం లేదని ప్రశంసించారు.

సీనియర్ భారత జట్టులో వైభవ్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని కోచ్ సూచించారు. బెంచ్‌పై కూర్చోబెడితే ఎవరికీ అనుభవం రాదని స్పష్టం చేశారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కనీసం రెండు, మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించాలని కోరారు. బాగా ఆడితే తర్వాతి మ్యాచ్‌లోనూ కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. వైభవ్ రికార్డుల గురించి ఎప్పుడూ ఆలోచించడని, కేవలం బంతిపైనే పూర్తి దృష్టి పెడతాడని వివరించారు.

నేపాల్, పాకిస్థాన్ మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే ఔటై నిరాశ చెందిన వైభవ్‌కు తాను ధైర్యం చెప్పినట్లు ఓజా గుర్తుచేసుకున్నారు. దిగ్గజ ఆటగాడు సచిన్ తెందూల్కర్ సైతం కెరీర్‌లో ఎన్నోసార్లు విఫలమయ్యాడని చెప్పానన్నారు. క్రికెట్‌లో ఎత్తుపల్లాలు సహజమని, వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించినట్లు వెల్లడించారు. వైభవ్ ఇదే జోరు కొనసాగిస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాడని క్రీడా నిపుణులు సైతం భావిస్తున్నారు.