‘రాకా’లో అవకాశం ఇప్పించండి!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రాకా’. భారతీయ చిత్రసీమలో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రముఖ నటి ఐశ్వర్య లక్ష్మి నటిస్తున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం సాగింది. ఆమె ఇందులో కీలకమైన నెగెటివ్‌ షేడ్స్‌‌ ఉన్న పాత్రలో కనిపించనున్నారని వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ పుకార్లపై నటి ఐశ్వర్య లక్ష్మి స్వయంగా స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. వాటిని చూసి తాను కూడా సరదాగా నవ్వుకున్నట్లు తెలిపారు. తనకు ఎవరైనా ‘రాకా’లో అవకాశం ఇప్పిస్తే బాగుంటుందని నవ్వుతూ చమత్కరించారు. దీంతో ఆమె నటిస్తున్నారంటూ వచ్చిన ఊహాగానాలకు తెరపడింది.

ఈ భారీ చిత్రంలో నలుగురు కథానాయికలకు చోటు ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి అల్లు అర్జున్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె నటించనున్నారు. అలాగే మలయాళ నటి ఫెమినా జార్జ్‌‌ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరి ఎంపికను మాత్రమే చిత్ర బృందం అధికారికంగా ధ్రువీకరించింది. జాన్వీ కపూర్, రష్మిక పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.