ఏపీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా, ముఖ్యంగా ఆ నాలుగు నియోజకవర్గాల్లో గెలిచేది ఎవరు అన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. కుప్పం సీటుపై వైసీపీ ఆశలు పెట్టుకోగా పిఠాపురం, మంగళగిరితో పాటు హిందూపుర్‌లో బాలయ్యపై బీసీ అస్త్రం పనిచేస్తుందా అన్న సందేహాలు నెలకొన్నాయి.అలాగే కడపలో షర్మిల ప్రభావం ఎంతవరకు చూపుతుంది? ఏపీ వ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో కుప్పం, పిఠాపురం, మంగళగిరి, హిందూపురం స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైసీపీ. ఈ నాలుగు స్థానాల్లో ఎలాగైనా జెండా ఎగరేయాలని జగన్ పక్కా ప్రణాళిక రచించారు. ఇందులో మూడు స్థానాల్లో మహిళా అభ్యర్థులను బరిలో దించారు. ముఖ్యంగా పిఠాపురం స్థానంలో గెలుపు ఎవరిని వరిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మెగాస్టార్ మద్దతివ్వడమే కాదు మెగా ఫ్యామిలీ అంతా పిఠాపురంలో విస్తృత ప్రచారం నిర్వహించింది. అలాగే జబర్దస్త్ టీమ్ కూడా విస్తృతంగా ప్రచారం చేయగా అందరి కళ్లు ఈ స్థానంపై ఉన్నాయి. ఎన్నికల ప్రచారం చివరి రోజు పిఠాపురంలో పర్యటించిన జగన్.. వంగ గీతను గెలిపిస్తే ఆమెను డిప్యూటీ సీఎం చేసి, తన పక్కన కూర్చోబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో పిఠాపురంలో సమరంలో గెలిచేది ఎవరా అనే టెన్షన్ నెలకొంది.
ఇక మంగళగిరిలో లోకేష్ గెలిస్తే తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనుండగా హిందూపుర్‌లో బాలయ్య గెలిస్తే హ్యాట్రిక్ కొట్టినట్లు అవుతుంది. అందుకే ఈ స్థానాల్లో గెలుపు ఎవరిని వరిస్తుందా అనే టెన్షన్‌తో పాటు జోరుగా బెట్టింగ్ నడుస్తోంది.