ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న లీడర్ బొత్స సత్యనారాయణ. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సైతం చెరగని ముద్రవేశారు. ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు బొత్స. ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సైతం పనిచేశారు.
ఇక ఏపీలో ఎన్నికలకు మరో 6 నెలల సమయం ఉండగా తన వారసుడిని దించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా చీపురుపల్లి నుండి తన తనయుడు సందీప్‌ని బరిలోకి దించేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు వైసీపీ చీఫ్, సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలియగా బొత్స విజయనగరం ఎంపీగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవలె బొత్సకు ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతంగా సాగింది. దీంతో ఒకవేళ రెస్ట్ తీసుకోవాలని భావిస్తే విజయనగరం ఎంపీగా తన సతీమణి బొత్స ఝాన్సీరాణిని రంగంలోకి దించేలా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఓ ఎమ్మెల్యే టికెట్‌తో పాటు ఎంపీ టికెట్ తన కుటుంబానికే దక్కేలా స్కెచ్ వేస్తున్నారు. విజయనగరం రాజకీయాలలో ఇప్పటికే బొత్స మేనల్లుడు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు చక్రం తిప్పుతున్నారు. ఏదిఏమైనా బొత్స తనయుడి పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన వార్త ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.