స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రాకా’. ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అద్భుతమైన వార్త వెలుగులోకి వచ్చింది. షూటింగ్ దశలోనే ఈ చిత్రం ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది.
‘రాకా’ సినిమా కోసం దర్శకుడు అట్లీ అత్యాధునిక మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. హాలీవుడ్‌లో ‘అవతార్’ లాంటి ఎన్నో గ్రేట్ మూవీస్‌ను ఇదే టెక్నాలజీ సాయంతో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా కోసం ఏకంగా 37 మంది నటుల హావభావాలను మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా ఒకేసారి రియల్‌టైమ్‌లో చిత్రీకరించారు. ఈ వినూత్న ప్రయోగం ద్వారా ఈ అరుదైన రికార్డు సాధ్యమైంది. ఇందుకు సంబంధించిన అధికారిక సర్టిఫికెట్‌ను గిన్నిస్ వరల్డ్ రికార్డు డైరెక్టర్ స్వయంగా దర్శకుడు అట్లీకి, హీరో అల్లు అర్జున్‌కు అందజేశారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం మూడు విభిన్న కాలాల నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. పురాణాలు, ఆధునిక కాలం చక్కటి మేళవింపుగా ఈ కథ రూపుదిద్దుకుంటోంది. ఇందులో దీపిక పదుకొణెతో పాటు మరో ముగ్గురు స్టార్ హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. జాన్వీ కపూర్ శక్తిమంతమైన గిరిజన యువతిగా, రష్మిక మందన్న కీలక మార్గదర్శక పాత్రలో కనిపించనున్నారు. అలాగే మృణాల్ ఠాకూర్ కూడా మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల టాక్.
అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. భారీ హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని చిత్ర బృందం సంకేతాలు ఇస్తోంది. విజువల్ వండర్‌గా రానున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా స్థాయిని మరోసారి ప్రపంచం ముందు నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

