ఆంధ్రప్రదేశ్ లో పొగాకు (Tobacco) రైతులు ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. మార్కెట్‌లో పొగాకు ధరలు రోజురోజుకూ పతనమవుతుండటంతో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి మార్కెట్‌లో జోక్యం చేసుకోవాలని…తమకు మద్దతు ధర లభించేలా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పొగాకు బోర్డు వేలం కేంద్రాలలో వ్యాపారులు, కొనుగోలుదారులు సిండికేట్‌గా మారి ధరలను తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి క్వింటాల్ పొగాకు ధర భారీగా పడిపోయింది. దీనికి తోడు వాతావరణ మార్పులు, అధిక పెట్టుబడి ఖర్చుల వల్ల ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతులకు ఈ ధరల పతనం కోలుకోలేని దెబ్బగా మారింది.
పొగాకు పండించే ప్రకాశం, నెల్లూరు, గుంటూరు తదితర ప్రాంతాల రైతులు, పొగాకు బోర్డు కనీస ధరను నిర్ణయించి, ప్రైవేట్ వ్యాపారుల దోపిడీ నుండి తమ్ము కాపాడాలని కోరుతున్నారు. ప్రభుత్వం గనుక జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించకపోతే, తాము అప్పుల ఊబిలో కూరుకుపోతామని…రాబోయే రోజుల్లో ఆత్మహత్యలే శరణ్యమని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి చంద్రబాబు సర్కార్ ఇప్పటికైనా స్పందించి పొగాకు రైతులకు బాసటగా నిలుస్తుందో లేదో వేచిచూడాలి.
