తెలంగాణ బీజేపీకి మరో షాక్ తగిలింది. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, బీజేపీ అధికార ప్రతినిధి అనుగుల రాకేష్ రెడ్డి రాజీనామా చేశారు. ఇక తన రాజీనామా సందర్భంగా కన్నీటి పర్యంతం అయ్యారు. పార్టీనే తన ఊపిరిగా బ్రతికానని కానీ ఇవాళ ఆ పార్టే తనకు వెన్నుపోటు పొడిచిందన్నారు. తాను చేసిన సేవను ప్రజలు గుర్తిస్తే పార్టీ మాత్రం గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వరంగల్ వరదల సమయంలో ఎవరు చేయని విధంగా ముందుండి సేవా కార్యక్రమాలు చేశానని తెలిపారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేశానని తెలిపారు. తన వెంట నడిచిన కార్యకర్తలు పార్టీ కోసం రక్తం చిందించారన్నారు. బీజేపీపై ప్రజల్లో నమ్మకం కలిగించానని తెలిపారు. ఎంత చేసినా తనను పార్టీ గుర్తించలేదని కన్నీటి పర్యంతం అయ్యారు.
తనకు టికెట్ దక్కలేదని బాధ లేదన్నారు. టికెట్ అనౌన్స్ చేసి 9 రోజులు గడుస్తున్న ఒక్క నాయకుడు తనకు ఫోన్ చేయలేదని ఇది పార్టీనా లేక ఇంకేదైనా అని ప్రశ్నించారు. టికెట్ దక్కించుకున్న రావు పద్మ తనపై గెలిచిందనే భావనలో ఉండటం దురదృష్టకరమన్నారు. బీజేపీలో పరిస్థితులు బాగా లేవని చాలా మంది నాయకులు బాధతోనే ఉన్నారన్నారు. చాలా బాధతోనే బీజేపీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటున్నానని చెప్పారు. తనతో పాటు వందలాది మంది కార్యకర్తలం రాజీనామా చేస్తున్నామని వెల్లడించారు. 2013 నుండి పార్టీ కోసం అవిశ్రాంతంగా శ్రమించానని…జాతీయవాదం అనే సిద్ధాంతం కోసం ముందుకు వెళ్లానని చెప్పారు.అనేక మంది కార్యకర్తలు వారి భుజాలపై తనను మోశారన్నారు.
వాస్తవానికి తెలంగాణ బీజేపీ వాయిస్ బలంగా వినిపించిన వారిలో ఒకరు రాకేష్ రెడ్డి. వరంగల్ పశ్చిమ టికెట్‌ని ఆశీంచి కొంతకాలంగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ టికెట్‌ను రావు పద్మకు కేటాయించింది. అప్పటి నుండి అసంతృప్తితో ఉన్న ఆయన బీజేపీకి రాజీనామా చేశారు.