శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తాను చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూనే మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు,జనసేనాని పవన్‌పై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు.
చంద్రబాబును అధికారంలోకి తేవడానికి దత్తపుత్రుడి తాపత్రయం తప్ప… ప్రజల కోసం కాదని పవన్‌కు చురకలు అంటించారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి పవన్ అని దుయ్యబట్టారు. ఇక అక్కడ పోటీ చేసిన పవన్‌కు వచ్చిన ఓట్లు చూస్తే నవ్వు రాకమానదన్నారు. స్వతంత్ర్య అభ్యర్థి చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చి నోట్లు కూడా జనసేనకు రాలేదని ఎద్దేవా చేశారు. అలాంటి పవన్ ఇక్కడ వచ్చి రాజకీయాలు చేస్తాననడం సిగ్గుచేటన్నారు. ఏపీ ప్రజలకు చుక్కలు చూపిస్తాడట ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ – జనసేన దొంగల ముటాగా మారి ప్రజలపై యుద్దం చేయడానికి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన నేతలు నాన్ లోకల్స్ అని, వారికి ఏపీతో సంబంధం లేదన్నారు. ఏపీ అభివృద్ధి చెందుతుంటే ఏడుస్తున్నారని మండిపడ్డారు.నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి ఇక్కడ ఏం జరగాలో నిర్ణయం చేస్తారని..దీనిని ప్రజలంతా ఆలోచించాలన్నారు. టీడీపీ హయాంలో జరిగిన విచ్చలవిడి దోపిడిని అరికట్టామని తెలిపారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంకు నీళ్లు ఇచ్చింది జగన్ సర్కారే అని గుర్తు చేశారు.