ఏపీ మాజీ సీఎం జగన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన సాధారణ పాస్‌పోర్టును ఐదేళ్ల పాటు రెన్యువల్ చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్ట్ విధించిన పాస్‌పోర్ట్ కాలపరిమితిని ఒక ఏడాది నుంచి 5 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు తీర్పు వెలువరించింది న్యాయస్థానం.
ట్రయల్ కోర్టు విధించిన మిగతా షరతులన్నీ అలాగే ఉంటాయని , విజయవాడ కోర్టు ఆదేశించిన విధంగా ప్రజాప్రతినిధుల కోర్టుకు స్వయంగా వెళ్లి రూ. 20 వేల పూచీకత్తు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
జగన్ సీఎంగా ఉన్న సమయంలో డిప్లొమాట్ పాస్ పోర్టు ఉండేది. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఆ పాస్ పోర్టు రద్దు అయింది. జనరల్ పాస్ పోర్టు కోసం జగన్ దరఖాస్తు చేసుకోగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న కేసుపై ఎన్‌వోసీ తీసుకోవాలని పాస్ పోర్ట్ కార్యాలయం లేఖ రాసింది. దీంతో ఎన్వోసీ ఇవ్వాలంటూ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఒక సంవత్సరం పాటు పాస్ పోర్టు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా ఐదేళ్లు రెన్యువల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పాస్ పోర్టు రావడంతో జగన్ విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.