మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలన విజయం సాధించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ ఇప్పుడు డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. నివిన్ పౌలీ, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు గిరీష్ ఏడీ దర్శకత్వం వహించారు. ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
థియేటర్లలో రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే తెలుగు థియేటర్లలో విడుదలైది.
బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు దాదాపు రూ.325 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. గతంలో ‘లోక చాప్టర్: 1 చంద్ర’ పేరిట ఉన్న రూ.302 కోట్ల రికార్డును ఇది అధిగమించింది. దీనితో మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన నంబర్ వన్ చిత్రంగా నిలిచింది.
ఈ కథ అంతా ఆష్లే (మమితా బైజు), జస్టిన్ (నివిన్ పౌలీ) చుట్టూ తిరుగుతుంది. కుటుంబ ఆర్థిక కష్టాల వల్ల ఆష్లే కుటుంబం సొంతూరు వదిలి అంగమాలికి వస్తుంది. అక్కడ చర్చికి చెందిన ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె ఇంటి పక్కనే జస్టిన్ ఉంటాడు. గతంలో ఎదురైన చేదు బ్రేకప్ వల్ల అతను పెళ్లికి దూరంగా ఉంటాడు. కానీ అతని మంచి గుణాలను చూసి ఆష్లే ఇష్టపడుతుంది. ఆ తర్వాత జస్టిన్ కూడా ఆమె ప్రేమను అంగీకరిస్తాడు. వీరి రహస్య ప్రేమ పెద్దలకు తెలియడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. కుటుంబాల నుంచి ఎదురైన అడ్డంకులను వీరు ఎలా దాటారనేది మిగిలిన ఆసక్తికరమైన కథ.

