బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తోన్న పలువురు సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, టీవీ నటులపై కేసులు నమోదయ్యాయి. ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, టెస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, బండారు శేషాయని సుప్రీత తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
బెట్టింగ్ యాప్స్ కేసులో 4 గంటలకు పంజాగుట్ట పీఎస్ లో విచారణకు రావాల్సిన విష్ణుప్రియ, టేస్టీ తేజ గైర్హాజరు అయ్యారు. వాళ్లిద్దరి తరఫున పంజాగుట్ట పీఎస్ కు వచ్చి సమయం కోరారు RJ శేఖర్ భాష.
బెట్టింగ్ యాప్స్ బారీన పడి ఇప్పటికే వెయ్యి మందికి పైగా యువకులు ఆత్మహత్య చేసుకోగా దీనిపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఎప్పటికప్పుడు సెలబ్రెటీల తీరును తూర్పారబడుతున్నారు.
పోలీసుల సీరియస్ యాక్షన్‌తో సెలబ్రెటీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తెలియక తప్పు చేశాం క్షమించండి అని పోలీసులను వేడుకుంటున్నారు. నన్ను క్షమించండి.. తెలియక ప్రమోట్ చేశాను అని నటి సురేఖ వాణి కూతురు సుప్రీత తెలిపారు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ వీడియో పోస్ట్ చేసి సారీ చెప్పారు. తన కుమార్తె బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు అని సురేఖా వాణి తెలిపారు. సుప్రిత తనకు వచ్చిన పోస్ట్ లను రీపోస్ట్ మాత్రమే చేసింది. తెలియక చేసినదానికి సుప్రిత సారీ చెప్పింది అన్నారు.
ఇక గతంలోనూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, నిధి అగర్వాల్, మంచు లక్ష్మీ తదితరులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.