తిరుపతి జిల్లాలోని రేణిగుంట మండలం ఆంజనేయపురంలో చారిత్రక ఆంజనేయస్వామి ఆలయాన్ని కూల్చివేయడంపై వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాన్ని కూల్చివేసి ఆ నెపాన్ని వైఎస్సార్సీపీపై నెట్టడం సరికాదని ఆయన మండిపడ్డారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
గతంలో ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఏర్పడిన ఆంజనేయపురం రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఈ ఆలయం ఉందని ఆయన తెలిపారు. మత్తులో ఉన్న కూలీలతో స్వామివారి విగ్రహాన్ని పెకిలించి తొలగించారని ఆరోపించారు. పల్లవుల కాలం నాటి ఈ ఆలయ చరిత్రను కొందరు వక్రీకరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 70 ఏళ్ల నాటి ఆలయమంటూ ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
పల్లవుల కాలంలో నిర్మించిన అభయ ఆంజనేయ స్వామి కోనేరు, ఆలయం అక్కడే ఉన్నాయని భూమన కరుణాకర్‌రెడ్డి గుర్తుచేశారు. శాస్త్రోక్తంగా తొలగించాల్సిన విగ్రహాలను ఇలా కూలీలతో తొలగింపజేయడం దారుణమన్నారు. ఈ దుర్మార్గపు చర్యకు కూటమి ప్రభుత్వానికి త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ఆలయాల కూల్చివేతలను సమర్థిస్తూ వైఎస్సార్సీపీపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ధర్మాన్ని రక్షిస్తామని చెప్పే పాలకులు, ఇలాంటి పనులకు పాల్పడటం ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రజలందరూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.

