వైసీపీ అధినేత, సీఎం జగన్ ఐదో జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నాలుగు జాబితాల్లో 58 అసెంబ్లీ, 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను మార్చారు జగన్. అయితే తాజాగా వెలువరించే ఐదో జాబితాలో ఇప్పటివరకు ప్రకటించిన జాబితాలో కొంతమందిని మార్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా కర్నూల్ పార్లమెంట్ ఇంఛార్జీగా మంత్రి గుమ్మనూరు జయరాంను నియమించింది. అయితే ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు విముఖత చూపించారు. ఇక తన పేరు ప్రకటించినప్పటి దగ్గరి నుండి అసంతృప్తితోనే ఉన్నారు. దీంతో ఆయన స్థానంలో కర్నూల్ మేయర్ బీవై రామయ్యను ఇంఛార్జీగా ఖరారు చేశారు జగన్.ఇందుకు సంబంధించిన ప్రకటన రెండు రోజుల్లో రానుంది.
దీంతో పాటు ఇప్పటికే ప్రకటించిన కొన్ని స్థానాల్లో రీసర్వే చేయించాలని భావిస్తున్నారట జగన్. ఎమ్మిగనూరుతో పాటు పలు నియోజకవర్గాల్లో రీసర్వే చేసి అభ్యర్థులను మరోసారి మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో మరోసారి సర్వే చేయించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక త్వరలో ఐదో జాబితా వెలువడనున్న నేపథ్యంలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందోనని వైసీపీ కేడర్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.