ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కోవడం చంద్రబాబుకు చేతకాదని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరాచకాలు ఎక్కువ కాలం సాగవని సజ్జల హెచ్చరించారు.గుంటూరు జిల్లా జైలులో ఉన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని సోమవారం పార్టీ నేతలు పరామర్శించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తలశిల రఘురాం, మేరుగు నాగార్జున, అంబటి రాంబాబు, నూరి ఫాతిమా, డైమండ్ బాబు తదితరులు ములాఖత్ ద్వారా అప్పిరెడ్డిని కలిశారు.
అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పోలీసులను అడ్డం పెట్టుకుని స్థానిక ఎన్నికల్లో కూటమి గెలిచిందని ఆరోపించారు. పోలీసులు, కూటమి నేతలు కలిసి చట్టాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలిచారని, అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు.బ్యాలెట్ బాక్సులను అక్రమంగా తీసుకెళ్లే వారిని వదిలేసి, అక్రమాలను అడ్డుకున్న అప్పిరెడ్డిని అరెస్ట్ చేయడం దారుణమని సజ్జల అన్నారు. పోలింగ్ బూత్ల వద్దే కూటమి నేతలు డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ అదే తరహా అరాచకాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల బెదిరింపులకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఎన్నటికీ భయపడవని సజ్జల స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో కూటమి నేతలకు చట్టపరంగా శిక్ష తప్పదని హెచ్చరించారు. గతంలో ఈవీఎంలు, ఇప్పుడు బ్యాలెట్ బాక్సులతో కూటమి అక్రమాలు చేస్తోందని ఆరోపించారు. పులివెందులలో రెండు వేల మందికి పైగా అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. వైఎస్ జగన్ బయటకు వస్తే చంద్రబాబుకు వణుకు పుడుతోందని సజ్జల వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల మాదిరిగా పనిచేస్తున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు.

