సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణ సీఎం విదేశాలకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఈ నెల 15 నుండి దావోస్‌లో పర్యటించనున్నారు. దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు.
ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రముఖ గ్లోబల్ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో రేవంత్ సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే అవకాశాలు, ప్రయోజనాల గురించి వారికి వివరించనున్నారు. ప్రతి ఏడాది దావోస్‌లో ప్రపంచ ఆర్ధిక సదస్సు జరుగుతుంటుంది. ఈ సదస్సుకు అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలు, మల్టీనేషనల్ కంపెనీల అధినేతలు హాజరుకానున్నారు.
సీఎం రేవంత్‌తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, సీఎం కార్యదర్శి శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ వెళ్లనుండగా పెట్టుబడులు తెచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేయనున్నారు రేవంత్. నాలుగు రోజుల పాటు జరిగే చర్చల్లో తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంపై అంతర్జాతీయ వ్యాపార సంస్థల ప్రతినిధులతో మాట్లాడనున్నారు సీఎం రేవంత్. గతంలో కేటీఆర్ దావోస్ సదస్సులో రూ.21 వేల పెట్టుబడులను తేవడంలో సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈసారి రేవంత్ బృందం ఎన్ని పెట్టుబడులు తెస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విదేశీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, సౌకర్యాలను విదేశీ కంపెనీ ప్రతినిధులకు వివరించి పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనుంది రేవంత్ బృందం. మొత్తంగా దావోస్ పెట్టుబడుల ద్వారా రాష్ట్ర ఆర్ధిక రంగానికి ఊతమివ్వాలని భావిస్తున్నారు రేవంత్.