హైదరాబాద్ లోని మాదాపూర్లో పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, భవిష్యత్తులో ఉద్యోగులు ‘వర్క్ ఫ్రం లేక్స్’ అనే నినాదంతో చెరువుల వద్ద నుంచే పనిచేసేలా నగరంలోని చెరువులను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.
గతంలో చెత్తాచెదారం, మురుగునీరు, గుర్రపు డెక్క, అక్రమణలతో కేవలం 13 ఎకరాలకు కుంచించుకుపోయిన ఈ చెరువును హైడ్రా సహాయంతో సుమారు 30 ఎకరాలకు విస్తరించినట్లు సీఎం తెలిపారు. నగర ప్రజలకు మెరుగైన వాతావరణం, పర్యాటక సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని పునరుద్ఘాటించారు.
ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునను సీఎం ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతుగా నాగార్జున తన సొంత భూమిని ప్రభుత్వానికి అప్పగించారని ప్రశంసించారు. నాగార్జున సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ హీరోలా వ్యవహరించారని కొనియాడారు. ఆయన చేతుల మీదుగానే ఈ చెరువును ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు నాగార్జున మాట్లాడుతూ, నగర అభివృద్ధికి తన వంతు సహకారం అందించడం ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రభుత్వ చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వేడుకలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

