‘SIR’ గో బ్యాక్ ఉద్య‌మం రాబోతుంది: రేవంత్

దిల్లీలో జరిగిన ‘ప్రతిదిన్’ పత్రిక సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. నాడు బ్రిటిష్ వారి ‘సైమన్ కమిషన్’ను దేశం ఎలాగైతే వ్యతిరేకించిందో, నేడు ‘సర్‌’ (SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా ప్రజలు ఏకమవుతారని హెచ్చరించారు.

ఓటు హక్కు పేదవాడికి రాజ్యాంగం ఇచ్చిన పెద్ద ఆయుధం. కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా సుమారు 20 కోట్ల ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారి ఓట్లను తొలగించేందుకు ఏఐ టెక్నాలజీని వాడుతున్నారని విమర్శించారు. అధికారాన్ని మొత్తం దిల్లీలోనే కేంద్రీకరించారని మండిపడ్డారు.

లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. భవిష్యత్తులో లోక్‌సభలో 850 సీట్లు ఉంటే, దక్షిణాదికి కేవలం 198 సీట్లే దక్కుతాయని పేర్కొన్నారు. మిగిలిన 650 సీట్లు ఉత్తరాది వద్దే ఉంటాయని వివరించారు.

ఈ నిర్ణయంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దక్షిణాది మద్దతు అవసరం లేకుండా పోతుంది. ఇప్పటికే కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖలన్నీ ఉత్తరాది నేతలకే దక్కాయని రేవంత్ గుర్తుచేశారు. చిన్న రాష్ట్రాల గొంతు నొక్కేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం కావాలనే తొక్కిపెడుతోందని ఆరోపించారు. రీజినల్ రింగ్‌రోడ్డు, మెట్రో ప్రాజెక్టుల అనుమతులు పీఎంవోలో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. తెలంగాణకు రావాల్సిన సెమీ కండక్టర్ పరిశ్రమను చివరకు గుజరాత్‌కు తరలించారని విమర్శించారు. దేశంలో ప్రస్తుతం మిగతా రాష్ట్రాలు వర్సెస్ గుజరాత్ అన్నట్లు పాలన సాగుతోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.