ఆరేళ్ల చిన్నారి చేసిన సాయం.. ప్రమాదం తృటిలో తప్పింది!

దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఒమన్ జాతీయుడైన కో-పైలట్ విమానాన్ని హైజాక్ చేయడానికి ప్రయత్నించాడు. భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై అతడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దాంతో కాక్‌పిట్‌లో తీవ్ర ఘర్షణ మొదలైంది. విమానం ఒక్కసారిగా అదుపుతప్పే స్థాయికి చేరింది.

సరిగ్గా అదే సమయంలో కాక్‌పిట్ పక్కనే ఉన్న టాయిలెట్‌లో ఆరేళ్ల నినా అనే చిన్నారి ఉంది. లోపల జరుగుతున్న అరుపులు, కేకలు ఆమె వింది. తీవ్ర భయంతో బయటకు వచ్చి తన తండ్రి త్వివికా మానేస్ వద్దకు పరుగెత్తింది. కాక్‌పిట్ నుంచి భయానక శబ్దాలు వస్తున్నాయని తండ్రికి చెప్పింది. ‘మనం చనిపోవడం లేదు కదా?’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

పాప మాటలతో తండ్రి వెంటనే అప్రమత్తమయ్యాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాక్‌పిట్ వైపు పరుగెత్తాడు. అక్కడ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ రక్తపు మడుగులో కనిపించారు. తీవ్ర గాయాలైనా ఆయన ప్రయాణికుల కోసం తలుపు తెరిచి ఉంచారు. పరిస్థితిని గమనించిన త్వివికా మానేస్, మరో ఇద్దరు ప్రయాణికులు వెంటనే రంగంలోకి దిగారు. హెడ్‌ఫోన్ వైర్లు, కేబుల్స్ ఉపయోగించి నిందితుడిని గట్టిగా కట్టేశారు.

ఈ గందరగోళంలో విమానం తీవ్ర వేగంతో కిందికి దూసుకెళ్లింది. క్యాబిన్‌లోని ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. అదృష్టవశాత్తూ విమానంలో ప్రయాణిస్తున్న ఇతర ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు నియంత్రణను చేపట్టారు. సౌదీ అరేబియాలోని తబూక్ నగరంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.

ఆ చిన్నారి సరైన సమయంలో చెప్పకపోతే ఘోర విపత్తు జరిగేది. 170 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయేవారు. రక్తమోడుతున్నా ధైర్యంగా పోరాడిన కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ సాహసాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసించారు. చిన్నారి సమయస్ఫూర్తి, ప్రయాణికుల ధైర్యం అందరి ప్రాణాలను కాపాడాయి.