ఏపీ ప్రభుత్వ ఏర్పాటులో జనసేన కీలకంగా మారిన సంగతి తెలిసిందే. పోలీ చేసిన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది జనసేన. డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టగా అనంతరం క్రీయాశీలక సభ్యత్వ నమోదును ప్రారంభించారు.
ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఊహించని స్పందన వచ్చింది. పార్టీ సభ్యత్వాలు గతేడాది కంటే రెట్టింపు అయ్యాయి. దీంతో జనసైనికుల్లో జోష్ నెలకొంది.జూలై18 నుంచి 28వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించగా అప్పటికే 10లక్షల సభ్యత్వాలు దాటాయి. దీంతో గడువును మరో వారం పాటు పొడగించారు.
ఇప్పటివరకు 14లక్షల సభ్యత్వాలు నమోదు అయినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అధికారంలోకి రాకముందు జనసేన సభ్యత్వాలు కేవలం 5,40,000 మాత్రమే. ఇప్పుడు దీనికి రెండింతలు దాటాయి. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలే కాదు మిగితా నియోజకవర్గాల్లో మంచి స్పందన వస్తోంది.
ప్రతి నియోజకవర్గంలోనూ ఇంఛార్జ్‌లు, పార్టీ నేతలు, కార్యకర్తలు సభ్యత్వ నమోదుపై స్పెషల్ ఫోకస్ సాధించడంతో జనసేన సభ్యత్వాలు భారీగా పెరిగాయి. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నవారికి రూ.500 రూపాయలతో బీమా కల్పిస్తోంది జనసేన. ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే క్రియాశీలక సభ్యత్వం ఉన్న కుటుంబాలకు ఐదు లక్షల బీమా చెక్కులు అందజేస్తోంది. ఇప్పటికే 20 కోట్ల రూపాయలకు పైగా విలువైన చెక్కులను వందలాదిమంది క్రియాశీలక సభ్యుల ఫ్యామిలీలకు అందించారు. దీంతో జనసేన సభ్యత్వాలు డబుల్ అయ్యాయి.