ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందా?, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ పేరుతో రెడ్ బుక్ ఫ్లేక్సీల ఏర్పాటు దీనికే సంకేతామా?, జగన్ చెప్పినట్లు ఏపీలో లోకేష్ చెప్పిందే జరుగుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఏపీలో హడావిడిగా 96 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. ఇందులో లోకేష్ రెడ్ బుక్ మార్క్ స్పష్టంగా కనిపించింది. బదిలీ అయిన డీఎస్పీల్లో ఎక్కువ మంది పేర్లు రెడ్‌బుక్‌లో ఉండటంతో వారికి పోస్టింగ్ లు ఇవ్వలేదని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
వాస్తవానికి ఏపీ ఎన్నికలకు ముందు రెడ్ బుక్ పేరుతో హల్‌చల్ చేశారు నారా లోకేష్. బహిరంగంగానే ప్రజల సమక్షంలో పలువురు పోలీసు అధికారుల పేర్లు చెబుతూ తాము అధికారంలోకి వస్తే వారి సంగతి తెలుస్తామని హెచ్చరించారు. అంతేగా ప్రజల ముందు పదేపదే రెడ్ బుక్ చూపిస్తూ ఇందులో అధికారుల పేర్లు రాస్తున్నట్లు ప్రకటించారు.
ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్‌ని ఓపెన్ చేశారు లోకేష్. జగన్ ఢిల్లీలో ధర్నా చేసిన సందర్భంగా లోకేశ్ రెడ్‌బుక్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అయితే తాను ఇంకా రెడ్ బుక్ తెరవలేదని పైకి చెప్పిన లోకేష్ ఇప్పుడు డీఎస్పీల బదిలీల్లో స్పష్టంగా తన మార్క్ చూపించారు. తాజాగా ఒకేసారి 96 మంది డీఎస్పీలకు స్థాన చలనం కలిగించగా ఇందులో 57 మందికి ఎక్కడా పోస్టింగ్ లు ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టారు. వీరిలో లోకేష్ ఎన్నికల ప్రచారంలో చెప్పిన పోలీసుల పేర్లు ఉండటం విశేషం. రాజంపేట డీఎస్పీ వీఎస్‌కే చైతన్య, తుళ్లూరు డీఎస్పీ అశోక్‌కుమార్ గౌడ్ గతంలో టీడీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని పని చేశారని ఆరోపణలు ఎదుర్కొంటుండగా వీరిద్దరిని ఈ బదిలీల కంటే రెండు రోజుల ముందే బదిలీ చేసి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. తాజాగా మరో 57 మందిని వెయిటింగ్‌లో పెట్టడం చర్చనీయాంశంగా మారింది.