ఇజ్రాయెల్ పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూటమి అతిపెద్ద శక్తిగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజారిటీకి ఆ కూటమి దూరంగా నిలిచింది. దీంతో తదుపరి ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారనే అంశంపై సందిగ్ధత నెలకొంది.
ఇజ్రాయెల్ పార్లమెంటు నెస్సెట్‌లో మొత్తం 120 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 61 సీట్లు సాధించాల్సి ఉంటుంది. తాజా ఫలితాల సరళి ప్రకారం నెతన్యాహు కూటమికి 53 స్థానాలు దక్కే అవకాశం కనిపిస్తోంది. గడి ఐసెన్కాట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి 48 స్థానాలను గెలుచుకునే దిశగా ఉంది. అరబ్ పార్టీలు 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ దక్కకపోవడంతో సంకీర్ణ చర్చలు మొదలయ్యాయి.
అరబ్ పార్టీలు ఎన్నికలను దొంగిలించాయని నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ ఆరోపించింది. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే శక్తులు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేశాయని పేర్కొంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను బెదిరించారని ఆరోపణలు చేసింది. అయితే యూదు మెజారిటీతో బలమైన మితవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నెతన్యాహు పిలుపునిచ్చారు. అరబ్ పార్టీల మద్దతుతో సర్కార్ ఏర్పాటును ఆయన పూర్తిగా తోసిపుచ్చారు.
ఇజ్రాయెల్‌లో ఓటర్లు నేరుగా ప్రధానిని ఎన్నుకోరు. రాజకీయ పార్టీలకే తమ ఓట్లు వేస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఎవరికీ రాకపోవడంతో ఇతర పార్టీల మద్దతు కీలకంగా మారింది. ప్రతిపక్ష కూటమి, అరబ్ పార్టీలు కలిస్తే సంఖ్యాబలం 67 స్థానాలకు చేరుతుంది. కానీ అరబ్ పార్టీలతో చేతులు కలపడానికి ప్రతిపక్షంలోని కొన్ని పార్టీలు ఇష్టపడటం లేదు. మరోవైపు ఇరు వర్గాల ప్రతినిధులు తమతో మాట్లాడుతున్నారని అరబ్ పార్టీల నేత మన్సూర్ అబ్బాస్ తెలిపారు.
ఈ ఎన్నికల్లో గత పావు శతాబ్దంలో ఎన్నడూ లేనంతగా భారీ పోలింగ్ నమోదైంది. సైనిక సిబ్బంది కూడా రికార్డు స్థాయిలో 79.9 శాతం మేర ఓటింగ్‌లో పాల్గొన్నారు. అక్టోబర్ 7, 2023న హమాస్ దాడి జరిగిన తర్వాత దేశంలో జరుగుతున్న తొలి సార్వత్రిక ఎన్నికలు ఇవే కావడం విశేషం. గాజా యుద్ధం నేపథ్యంలో జరిగిన ఈ పోరులో నెతన్యాహుకు పూర్తి ఆధిక్యం లభించకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

