అధికారం ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదని తేల్చిచెప్పారు మాజీ మంత్రి జోగి రమేశ్. శుక్రవారం మీడియాతో మాట్లాడిన రమేష్…రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమని ఇది చంద్రబాబు మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పగ తీర్చుకోవాలనుకుంటే తనపై చూపించాలని కానీ నా కొడుకుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం దారుణమని మండిపడ్డారు.
అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా కొనుగోలు చేయలేదని దీనిపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్, సత్యప్రసాద్ ఎవరొచ్చిన వివరిస్తానని చెప్పారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నిరసన తెలిపానని కానీ తనపైనే కేసులు నమోదు చేశారన్నారు.
కూటమి నేతలు ప్రజలకు మంచి చేయడం పక్కన పెట్టి వైసీపీ నేతలనే టార్గెట్ చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. రేపు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఇలాగే ప్రవర్తిస్తే టీడీపీ నేతల పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలన్నారు. చంద్రబాబు ఇంటి వద్ద నిరసన తెలిపినందుకు పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారని ఇందుకు సంబంధించి వివరణ ఇచ్చానని చెప్పారు. న్యాయపరంగా ఈ కేసులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు.