టీడీపీ ఎన్నికల వ్యహకర్తగా ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో వైసీపీ గెలవడంలో కీలకపాత్ర పోషించారు పీకే. ఆయన రచించిన వ్యూహాలు ఒక ఎత్తైతే జగన్‌పై ప్రజల్లో ఉన్న నమ్మకం వైసీపీ అధికారంలోకి రావడానికి తోడ్పడింది. ఇక ఆ తర్వాత జగన్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్నారు. పాలనలో పారదర్శకత, ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టారు. ఫలితంగా జగన్ సర్కార్‌పై ప్రజల్లో అంతగా వ్యతిరేకత లేదు.
అయితే సీన్ కట్ చేస్తే అధికారం కోసం ఎన్ని ఎత్తుగడలైన వేసే చంద్రబాబు…ప్రతిపక్ష పార్టీలన్నింటిని కలుపుకుని పోయేందుకు రెడీ అవుతున్నారు. తొలుత పవన్, ఒకవేళ బీజేపీ దూరమైతే కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దీనికి తోడు ప్రశాంత్ కిషోర్‌ని రంగం లోకి దించారు. అయితే ఇప్పటివరకు బాగానే ఉన్నా పీకే ఎంట్రీతో పవన్ టీడీపీకి దూరమవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఎందుకంటే పీకేను తీసుకురావడం పవన్‌కు ఇష్టం లేదట. అదే సమయంలో టీడీపీని బీజేపీతో దగ్గర చేసేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు పవన్. ఇలాంటి సమయంలో పీకే ఎంటరవడంతో టీడీపీ – బీజేపీ కలవడం అసాధ్యం. దీంతో పీకే ఎంట్రీతో తమ నేత పని అయిపోయినట్లేనని జనసైనికులు మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే అసంతృప్తి ఉన్న టీడీపీతో కొనసాగడం తప్ప పవన్ ముందు వేరే ఆప్షన్ లేకపోవడంతో అన్ని తెలిసినా మౌనమే అన్ని ప్రశ్నలకు సమాధానం అన్నట్లు వ్యవహరిస్తున్నారట. అందుకే పీకేతో భేటీకి రావాలని ఆహ్వానం ఉన్నా పవన్ డుమ్మా కొట్టారని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఏపీ రాజకీయాలు ముఖ్యంగా టీడీపీ – జనసేన మధ్య పొత్తు రోజుకో ట్విస్ట్‌ను తలపిస్తోంది.