భూమిపై చేయాల్సిన కాలుష్యమంతా ఐరోపా, అమెరికా చేసి, ఆ మూల్యాన్ని పేద దేశాలపై రుద్దుతున్నాయని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. బెర్లిన్ గ్లోబల్ డైలాగ్ వేదికగా కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు. కాలుష్యం విషయంలో పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరిని ఆయన ఎండగట్టారు.
ప్రపంచ జనాభాలో భారత్ వాటా 17 శాతంగా ఉంది. అయినా దేశం నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు కేవలం 3 నుంచి 3.5 శాతం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఐరోపా జనాభా 3 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, వారి నుంచి 17 శాతం వరకు ఉద్గారాలు వస్తున్నాయని గుర్తుచేశారు. భారత్ తలసరి ఉద్గారాలు ఐరోపా తలసరిలో 10 శాతమేనని తేల్చిచెప్పారు.
కర్బన ఉద్గారాల నిబంధనలు, స్టీల్ దిగుమతులపై విధిస్తున్న కార్బన్ పన్నుల వల్ల ఐరోపాలోనే వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆయన హెచ్చరించారు. కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం (సీబీఏఎం) వల్ల వినియోగదారులపై అదనపు భారం పడుతోందన్నారు. నిబంధనలు కఠినతరం చేస్తే స్థానిక పరిశ్రమలే నష్టపోతాయని తెలిపారు. పోర్టులు, రోడ్ల నిర్మాణం ఖరీదైనదిగా మారి ఐరోపా తన పోటీతత్వాన్ని తానే కోల్పోతోందని చెప్పారు.
పర్యావరణ కాలుష్యానికి, ఓజోన్ పొర క్షీణతకు అభివృద్ధి చెందిన దేశాలే ప్రధాన కారణమని గోయల్ అన్నారు. 2015 పారిస్ సదస్సులో ఇచ్చిన హామీలను పశ్చిమ దేశాలు తుంగలో తొక్కాయని మండిపడ్డారు. అభివృద్ధి చెందుతున్న, ద్వీప దేశాలకు ఏటా 100 బిలియన్ డాలర్లు ఇస్తామని వాగ్దానం చేశారని గుర్తుచేశారు.
గడిచిన 11 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఐరోపా సమాఖ్య, సీబీఏఎం నుంచి దీనిపై ఎలాంటి సమాధానం లేదని ఆక్షేపించారు. పేద దేశాల అవసరాలను పట్టించుకోవడంలో, కర్బన ఉద్గారాల నియంత్రణకు ఆర్థిక తోడ్పాటు అందించడంలో అభివృద్ధి చెందిన దేశాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన తేల్చిచెప్పారు.

