ఇరికించబోయి దొరికిపోయిన పోలీసులు!

పంజాబ్‌లో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. శివసేన నేతను తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్లాన్ చేసిన పోలీసుల బండారం బయటపడింది. ఏఎస్ఐ స్థాయి అధికారి స్వయంగా నేత ఇంట్లో డ్రగ్స్ పెడుతూ సీసీటీవీ కెమెరాలకు చిక్కారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

పంజాబ్‌లోని ఖన్నా ప్రాంతంలో శివసేన నేత మహంత్ కశ్మీర్ గిరి నివాసం ఉంటున్నారు. స్థానిక పోలీసులు ఆయన్ను ఎలాగైనా అణచివేయాలని కుట్ర పన్నారు. ఇందులో భాగంగా ఏఎస్ఐ సుఖ్‌దేవ్ సింగ్ ఆయన ఇంట్లోకి రహస్యంగా ప్రవేశించారు. పరుపు కింద ఏదో అనుమానాస్పద వస్తువును ఉంచి అక్కడి నుంచి నిశ్శబ్దంగా బయటకు వచ్చారు. ఇదంతా ఆ ఇంటిలోని సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డైంది.

కొద్దిసేపటి తర్వాత అదే పోలీసు బృందం మహంత్ కశ్మీర్ గిరి ఇంటిపై దాడి చేసింది. ఇంట్లో సోదాలు చేసి.. అదే ప్రాంతంలో 30 గ్రాముల హెరాయిన్ లభించిందని సాకు చెప్పింది. ఈ డ్రగ్స్ కేసులో మహంత్ కశ్మీర్ గిరిని పోలీసులు హడావుడిగా అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు సీసీటీవీ పుటేజీని పరిశీలించారు.

ఏఎస్ఐ సుఖ్‌దేవ్ సింగే స్వయంగా డ్రగ్స్ పెట్టిన దృశ్యాలు బయటకు రావడంతో అసలు నిజం బట్టబయలైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు శాఖ తీవ్రంగా స్పందించింది. ఎస్ఎస్పీ దర్పణ్ అహ్లువాలియా వెంటనే అప్రమత్తమయ్యారు. నిందితుడైన ఏఎస్ఐ సుఖ్‌దేవ్ సింగ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తప్పుడు కేసులో ఇరుక్కున్న శివసేన నేత మహంత్ కశ్మీర్ గిరిని పోలీసులు వెంటనే విడుదల చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. పోలీసులే నేరాలకు పాల్పడటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.