‘వారణాసి’ కథపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పటి నుంచే కథపై ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఒక అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన రాజమౌళి, ఈ చిత్ర కథాంశంపై కీలక వివరాలను పంచుకున్నారు.

‘వారణాసి’ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే చిత్రమని ఆయన స్పష్టం చేశారు. అయితే సినిమా కేవలం సైన్స్ ఫిక్షన్‌లా మాత్రమే ఉండదని చెప్పారు. ఇందులో పౌరాణిక అంశాలతో కూడిన ఫాంటసీ ప్రధానంగా ఉంటుందని వివరించారు. ముఖ్యంగా తండ్రీ కొడుకుల మధ్య బలమైన భావోద్వేగాలు ఉంటాయి. అలాగే ఒక అందమైన ప్రేమకథ కూడా ఈ చిత్రంలో భాగమని వెల్లడించారు. ఆరేడు సినిమాలను కలిపి ఒక్క సినిమాగా మలిచిన భావన కలుగుతుందని చెప్పారు. వాటన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకురావడమే తనకు అతిపెద్ద సవాలుగా మారిందని ఆయన పేర్కొన్నారు.

ఈ చిత్రంలో మహేశ్‌ బాబు తన అంచనాలకు మించి నటించారని రాజమౌళి ప్రశంసించారు. ఆయన ప్రతిభ గురించి తనకు ముందే బాగా తెలుసన్నారు. కానీ షూటింగ్ మొదలయ్యాక తాను ఆశించిన దానికంటే రెట్టింపు ప్రతిభను కనబరిచారని కొనియాడారు. పాత్రలో పూర్తిగా లీనమై జీవించారని, అది చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపారు. ఆయనతో కలిసి పనిచేయడం ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతి అని చెప్పారు.

ఈ సినిమా చిత్రీకరణ దాదాపు తుది దశకు చేరుకుంది. కేవలం పది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని రాజమౌళి వెల్లడించారు. అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తి షూటింగ్ ముగియనుంది. నవంబరు నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేయనున్నారు. అదే సమయంలో ప్రచార కార్యక్రమాలను కూడా భారీ స్థాయిలో మొదలుపెట్టనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.