తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటేందుకే హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు స్పష్టమైన విధివిధానాలతో ముందుకెళ్తున్నామని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనను బీజేపీ అడ్డుకుంటామని చెప్పడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ గాంధీ వస్తే వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం బీజేపీ నేతల్లో మొదలైందని విమర్శించారు.
ఢిల్లీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరై స్వాగతించారని రేవంత్ గుర్తు చేశారు. కానీ తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు మాత్రం ఈ సమ్మిట్‌ను వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకే రకమైన విధానాలతో ప్రభుత్వ నిర్ణయాలను గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు. సమ్మిట్‌లో విదేశీ శక్తులు పాల్గొంటున్నాయని బీజేపీ అంటుంటే, ప్రజాధనం వృథా అవుతోందని బీఆర్ఎస్ అంటోందని ఎద్దేవా చేశారు.
కిషన్ రెడ్డి, రాంచందర్ రావు, కేటీఆర్ విజ్ఞతతో ఆలోచించాలని సీఎం సూచించారు. అనవసరపు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ప్రకటించారు. అందుకే అంతర్జాతీయ జర్నలిస్టులను కూడా ఈ సమ్మిట్‌కు ఆహ్వానించామని చెప్పారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం దేశంలోనే అత్యుత్తమ పాలసీని తీసుకొచ్చామని తెలిపారు. భారత్ సమ్మిట్‌లో భాగంగా జరిగే గిగ్ వర్కర్ల సమావేశంలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని వెల్లడించారు. పరిశ్రమలను ఆకర్షించి యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రధాన ధ్యేయమని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

