బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా సినిమా ‘మాతృభూమి’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఈ చిత్రం ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ దేశ రక్షణ కోసం సరిహద్దులో పోరాడే సైనికుడిగా కనిపించనున్నారు. మరోవైపు ఆయన భార్య, పిల్లలతో సంతోషంగా గడిపే కుటుంబ వ్యక్తిగా కూడా కనిపిస్తారు. ప్రముఖ నటి చిత్రాంగదా సింగ్ ఈ సినిమాలో సల్మాన్ భార్య పాత్రలో నటిస్తున్నారు. సల్మాన్ నటన, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.
భారత్-చైనా మధ్య 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తొలుత ఈ చిత్రానికి ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఆ తర్వాత దీనిని ‘మాతృభూమి’గా మారుస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు దర్శకుడు అపూర్వ లఖియా ఈ ప్రాజెక్ట్‌లో మార్పులు చేశారు.
సినిమా కథలో భాగంగా కొన్ని కల్పిత అంశాలు, రొమాంటిక్ సన్నివేశాలను అదనంగా జోడించారు. ఇందులో సుమారు 40 శాతం సినిమాను రీషూట్ చేసినట్లు సమాచారం. దేశభక్తి ప్రధానంగా సాగే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

