టీడీపీ పార్టీకి గట్టి పట్టున్న జిల్లాల్లో ఒకటి శ్రీకాకుళం. టీడీపీకి ఎంత వ్యతిరేక గాలి వీచినా ఇక్కడ ఎంపీ స్థానంతో పాటు పలు స్థానాల్లో ఎమ్మెల్యేలను గెలుస్తూ వస్తోంది. ఇక గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న ఒక ఎంపీ స్థానంతో పాటు, పది అసెంబ్లీ స్థానాలకు గానూ అన్నింటిని గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది టీడీపీ.
ఇక టీడీపీ అధికారంలోకి రాగా ఇక్కడి నుండి ఎంపీగా గెలిచినా రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రిగా, అచ్చెన్నాయుడు మరోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక అంతా తాము అనుకున్నట్లే జరుగుతుందని టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు భావించినా పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.
అధికారం ఉన్న తమ పెత్తనం ఏమి లేదని కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు ద్వితియ శ్రేణి నాయకులు ఆగ్రహంతో ఉన్నారని టాక్ నడుస్తోంది. ఇందుకు కారణం జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత జిల్లాను తన చేతిలో ఉంచుకుని పెత్తనం చెలయిస్తున్నారని అంతా ఆయన చెప్పినట్లే జరుగుతుండటంతో ఇదే నేతల అసంతృప్తికి కారణమైందని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.
కొంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తమకు అనుకూలమైన అధికారులను తెచ్చుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక టెక్కలి మినహా మిగితా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉండటంతో నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న అధికారులు, పోలీసులే ఉండటంతో తమ పనులు జరగడం లేదని టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందట. ఇప్పట్లో బదిలీలు ఉండవని చెప్పడంతో ప్రజాప్రతినిధులే కాక నేతలు కూడా తీవ్ర నిరాశ చెందారని ప్రచారం జరుగుతోంది. జిల్లాలో ముఖ్యనేత పార్టీలో సూపర్ పవర్ ఉండటంతో ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేకపోతున్నారు. అయితే త్వరలోనే ఈ అసంతృప్తి మరింత పెరిగితే అది ఖచ్చితంగా పార్టీకి నష్టంగా మారే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.