స్టాయ్యూ ఆఫ్ జస్టిస్ రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికం అన్నారు ఏపీ సీఎం జగన్. ఈ నెల 19న అంబేద్కర్ విగ్రహావిష్కరణ, అంబేద్కర్ స్మృతి వనాన్ని ప్రారంభించనున్నారు జగన్. ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు వస్తారని అంచనా వేశారు.
అంబేద్కర్ గారి మహా శిల్పం దేశానికే తలమానికం అని ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అన్నారు జగన్. చరిత్రను తిరగరాసేలా, మరెందరికో వందల సంవత్సరాల పాటు, స్ఫూర్తినిస్తుందన్నారు. ఈనెల 19న జరిగే విగ్రహావిష్కరణకు అందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు జగన్.
విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం కొలువుదీరనుంది. అంబేద్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా పెడస్టల్ ఎత్తు 85 అడుగులుంటుంది. అంటే మొత్తం 210 అడుగుల ఎత్తులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఠీవిగా నిలబడనుండగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం కావడం విశేషం.
స్వరాజ్ మైదానంలో రూ. 400 కోట్ల ఖర్చుతో అంబేద్కర్ విగ్రహం,స్మృతి వనాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 18.81 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటైంది. ఇందులో అంబేద్కర్ ఫోటో గ్యాలరీ, జీవిత విశేషాలు, శిల్పాలుంటాయి. ఓ కన్వెన్షన్ హాల్, ఫుడ్ కోర్టులు ఉంటాయి.